బీజేపీతోనే వచ్చింది చిక్కు.. కేసీఆర్, జగన్ తలో దిక్కు ! - kcr jagan differ views on bjp.. an analysis - TV9 Telugu

kcr jagan differ views on bjp.. an analysis, బీజేపీతోనే వచ్చింది చిక్కు.. కేసీఆర్, జగన్ తలో దిక్కు !
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ నదీజలాల పంపకంవంటి అంశాల్లో ‘ ఇచ్చి పుచ్చుకునే ‘ ధోరణిలో పరస్పరం ‘ స్నేహ భావం ‘ తో మెలగుతున్నప్పటికీ రాజకీయంగా బీజేపీతోనే వీరికి వచ్చిందో చిక్కు ! వీరి మధ్య గాఢమైన మైత్రికి కమలనాథులు గండి కొడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ పట్ల కేసీఆర్, జగన్ ఇద్దరూ భిన్నాభిప్రాయాలతో ఉండడం బీజేపీకి కలిసేట్టు వచ్చేలా ఉంది. తెలంగాణపై ప్రధాని మోదీ, హోం మంత్రి , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలపట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరిరోజున ఆయన వీరిని హెచ్ఛరించింత పని చేశారు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడానికి అనువుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ.. ‘ బిడ్డను బతికించడానికి వాళ్ళు (కాంగ్రెస్) తల్లిని చంపారంటూ ‘ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన కేసీఆర్.. ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని మోదీ మానుకోవాలన్నారు. ఇక- తెలంగాణ ఏర్పడిన రోజు చీకటి రోజని అమిత్ షా చేసిన కామెంట్స్ ను కూడా ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల వీళ్ళిద్దరూ తమ వైఖరి మార్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పోరాడి తెచ్చుకుందని, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ వేసిన ‘ భిక్ష ‘ కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల జగన్ హైదరాబాద్ వఛ్చి కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరిపినప్పుడు.. వీరి చర్చల్లో ప్రధానంగా… పొలిటికల్ గా బీజేపీ మెయిన్ ఎజెండా అయింది. ఆ పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న అంశమే కేంద్ర బిందువయింది.
ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ విషయానికి వస్తే.. కేసీఆర్ సర్కార్ తీరుకు పూర్తి భిన్నంగా ఉంది. కమల నాథులపట్ల జగన్ ప్రభుత్వం మెతక వైఖరి పాటిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వంపై ఈ రెండు రాష్ట్రాల రాజకీయ వైఖరులూ వేర్వేరుగా ఉండడాన్ని రాజకీయపరిశీలకులు గమనిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేవలేక చతికిలబడిపోగా.. బీజేపీ మెల్లగా ఇక్కడ బలం పుంజుకుంటోంది. అధికార తెరాస పార్టీకి గట్టి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అయితే అధికార టీఆర్ఎస్ కు సరైన ప్రతిపక్షమే లేకుండా పోయింది కూడా. కానీ.. ఏపీలో వైసీపీకి టీడీపీ ప్రతిపక్షంగా ఉండడం, బీజేపీ ఉనికి నామమాత్రం కావడం తెలంగాణ సీన్ కి పూర్తి రివర్స్ ! అందువల్ల అక్కడ జగన్ సారథ్యంలోని వైసీపీకి తెలుగుదేశం పార్టీయే ప్రత్యామ్నాయం..
ఇక ఈ రెండు రాష్ట్రాల ఆర్ధిక వనరుల విషయానికి వస్తే.. తెలంగాణాలో లోటు బడ్జెట్ ఉన్న సంగతి తెలిసిందే.. అప్పుల కోసం కేసీఆర్ ప్రభుత్వం దారులు వెతుక్కుంటోంది. ఆర్ధిక సాయంకోసం కేంద్రంపై ఆధారపడవలసిందే. తమ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కేంద్ర నిధులు ఈ రాష్ట్రానికి ఎంతయినా అవసరం. బహుశా ఈ కారణం వల్లే ఏపీలో జగన్ సర్కార్ బీజేపీ ప్రభుత్వం పట్ల అనుకూల ధోరణి పాటించక తప్పడంలేదు. తెలంగాణాలో ‘ బీజేపీ ముప్పు ‘ ను ఎలా ఎదుర్కోవాలన్న అంశంతో కేసీఆర్ కు తలనొప్పి తప్పడం లేదు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలనన్నిటినీ కుప్ప కూల్చి .. ‘ వన్ నేషన్.. వన్ పార్టీ ‘ అన్న లక్ష్యంతో వెళ్లాలనుకుంటున్న కమలనాథులకు గట్టి పోటీ ఇవ్వాలనుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి కత్తిమీద సామే!
For more information go for this link :https://tv9telugu.com

Comments