రూట్ మార్చిన స్మగ్లర్లు.. శంషాబాద్‌లో ఏం జరుగుతుందో తెలుసా? - Gold and Currency Smuggling in Samshabad RGI airport - TV9 Telugu
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు .. స్మగ్లింగ్ ముఠాలు పోలీసులకు దొరక్కుండా రకరకాలుగా దోపిడీలు చేస్తూనే ఉన్నారు. స్మగ్లర్లు కూడా పోలీసులకు చిక్కకుండా నయా మార్గాల్లో తమ కార్యక్రమాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. స్మగ్లర్లు అనగానే మాదక ద్రవ్యాలను తరలించే వాళ్లే ఎక్కువ గుర్తుకొస్తారు. విదేశాల నుంచి వీటిని రహస్య మార్గాల్లో రకరకాల మార్గాల్లో విమానాశ్రయన్ని దాటవేస్తుంటారు. ఎయిర్ పోర్టులో ఉండే నిఘా అధికారులకు చిక్కకుండా ప్రయాణికుల్లా కలరింగిస్తూ వీటిని దాటించేస్తుంటారు.
దేశంలో ఎన్నో విమానాశ్రయాలుండగా మన శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల కాలంలో స్మగ్లింగ్ కేసులు అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. స్మగ్లింగ్ ముఠాలు మన విమానాశ్రయాన్నే సేఫ్ అని ఎంచుకోవడం నిఘా వర్గాలకు సవాలుగా మారింది. హద్దూ అదుపు లేకుండా రెచ్చిపోతున్న స్లగ్లింగ్ కేటుగాళ్లు మత్తు పదార్ధాలు, బంగారం వంటి వాటిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు, ఏ మాత్రం భయం లేని కొంతమంది విదేశాలనుంచి యధేశ్చగా దొంగ బంగారాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తూ శంషాబాద్ పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో విదేశాలనుంచి బంగారం కిలోల కొద్దీ స్మగ్లింగ్ చేస్తున్నారు. అమాయకులైన ప్రయాణికులకు మాయమాటలు చెప్పి గల్ఫ్, అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలనుంచి వచ్చే ప్రయాణికులకు వాటిని అంటగట్టి వాటిని తరలిస్తున్నారు. అయితే వారు అక్కడినుంచి తీసుకొచ్చే పార్శిల్‌లో ఏముందో తెలియక, తీరా పోలీసుల తనిఖీలో బయటపడే సరికి లబోదిబో మనడం తప్ప చేసేది ఏమీ లేదు. అయితే అసలు సూత్రధారులు వేరే ఉండి ఈ తతంగం మొత్తం నడిపిస్తున్నారు. ఈ విధంగా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోంది.
శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖిల్లో విపరీతంగా బంగారం పట్టుబడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. మరోవైపు ఇక్కడ నిఘాను పెంచే సరికి వక్రమార్గాల్లో సైతం బంగారాన్ని తరలించే విధంగా లిక్విడ్ రూపంలోనూ, పేపర్ల రూపంలో.. ఇది గోల్డ్ కాదేమో అనే విధంగా దాన్ని తప్పిస్తున్నారంటే వారి తెలివి తేటలకు పోలీసులే అవాక్కవ్వాల్సి వస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్లేట్ల రూపంలో మస్కట్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2.75 కిలోల బంగారంతో పాటు నిందితులను పట్టుకున్నారు. ఈ తరహా బంగారం తరలింపుకు ప్రయత్నం చేసి ఎందరో కేసుల పాలయ్యారు. అయినప్పటికీ దుబాయ్ , మస్కట్ తదితర ప్రాంతాల నుండి వచ్చేవారు దొడ్డి దారిన బంగారం తీసుకురావటం మాత్రం మానటం లేదు. బంగారాన్ని ఇండియాకు తరలించాలని ప్లాన్ చేసుకునే అక్రమార్కులు ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో హ్యాండ్ బ్యాగుల్లో, సూట్ కేసుల్లో, కాలి బూట్లల బంగారాన్ని తరలించేవారు. ఇప్పుడు రూటు మార్చారు. ఎలాగైనా సరే స్పాట్‌కు చేరాలనే కాన్సెప్ట్‌తో ఏకంగా శరీరంలోపల.. పురీషనాళం నుంచి బంగారాన్ని జొప్పించి రవాణా చేస్తున్నారు. అలా అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, శంషాబాద్ విమానాశ్రయ నిఘా విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహ్మద్ అన్షద్ అనే ప్రయాణికుడి శరీరంలో ఏదో ఉన్నట్లు స్కానర్లు గుర్తించాయి. అతడి శరీరంలో బంగారం ఉందేమోనని అనుమానించిన పోలీసులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడి పురీష నాళం నుంచి నాలుగు గోళీలను గుర్తించారు. ఈ విధంగా స్మగ్లింగ్‌కు తెరతీస్తున్నారు.
ఇప్పటి వరకు బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదవుతుండగా తాజాగా విదేశీ కరెన్సీ కూడా స్మగ్లింగ్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. విచ్చలవిడిగా ఫారిన్ కరెన్సీ దిగుమతి అవుతున్నట్టుగా తనిఖీల్లో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 9న శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్తున్న హైదరాబాద్ చంద్రాయణగుట్టకు చెందిన వ్యక్తి వద్దనుంచి కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. అలాగే స్వీట్ బాక్స్‌లో కోటిన్నర రూపాయల విలువైన సౌదీ కరెన్సీని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అధికారుల తనిఖీల్లో పట్టుబట్టారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మంగళవారం ఆగస్టు 20 డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేయడంతో స్వీట్ బాక్సులో దుబాయి కరెన్సీ బయటపడింది.
గోల్డ్ స్మగ్లింగ్‌తో వార్తల్లో నిలుస్తున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ ఘటనలు కూడా ఇటీవల అధికమయ్యాయి. అయితే అక్రమార్కులు శంషాబాద్ విమానాశ్రయం ద్వారానే స్మగ్లింగ్ చేస్తున్నారనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడి అధికారులు చాకచక్యంగా ఎంతోమంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అంతర్జాతీ విమానాశ్రయంగా ప్రపంచ గుర్తింపు సాధించిన శంషాబాద్ విమానాశ్రయంలో మరింత నిఘాను నుంచి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
For more information go for this link : https://tv9telugu.com
Comments
Post a Comment